అంతేగాక రాజకీయ సమాజశాస్త్రం పరిశోధన సంబంధమై ప్రశ్నావళిని రూపొందించుకోవడం, సమాచార సేకరణ, కోడింగ్, స్కేలింగ్, వెరిఫికేషన్ మొదలైన వాటిని సమాజశాస్త్రం నుండి గ్రహించి ఉపయోగిస్తుండటం వల్ల ఈ శాస్త్రానికి సమాజ రాజకీయ శాస్త్రమనే నామమే సరియైనదని సమాజ శాస్త్రజ్ఞల అభిప్రాయం. ఈ భావన ప్రకారం రాజకీయ శాస్త్రాన్ని సమాజశాస్త్ర స్థాయికి కుదించడం జరుగుతుంది.
సాంఘిక, ఆర్థిక కారకాలు రాజకీయ ప్రవర్తనను, సంస్థలు ప్రభావితం చేసినప్పటికీ, సాంఘిక కారకాలచే పూర్తిగా పైచేయి అని చెప్పుటకు వీలులేదు. అంతేకాక ప్రతి రాజకీయ చర్య సాంఘికార్దిక పరిస్థితులతో అంటగట్టలేము. ఉదా॥ రాజకీయ పార్టీలు అధికారాన్ని కైవసం చేసుకొనేందుకు వివిధ రాజకీయ వర్గాలు అవలంభించే ఎత్తుగడలను సాంఘికార్దిక పరిస్థితులచే పరిశీలించడం కష్టమని యస్.యం. అప్సెట్ అభిప్రాయం. అంతేకాక రాజకీయాలు కేవలం ఆధార చలంకాలు (dependent variables) అనే భావన కూడా సరియైనది కాదు. కొన్ని సందర్భాలలో సాంఘికార్దిక పరిస్థితులు ప్రభుత్వాన్ని ప్రభావితం చేసినప్పటికి రాజకీయ సంస్థ అయిన ప్రభుత్వం కూడా సమాజాన్ని విస్త్రత స్థాయిలో ప్రభావితం చేయగల స్వతంత్ర రాజకీయ చలాంకం అని చెప్పవచ్చును.
రాజకీయ కారకాల (Political Factors) ప్రభావాన్ని విస్మరించి సామాజిక కారకాలకు (Social factors) అధిక ప్రాధాన్యతనిచ్చే సమాజ రాజకీయ శాస్త్రం ఉత్పత్తిదారులు లేకుండా వినియోగదారులుండగలరనే ఆర్ధిక విధానంలాంటిదని విమర్శకుల అభిప్రాయం. రాజకీయ సమాజశాస్త్రం సమాజం పార్టీ పద్ధతిని ఎలా నిర్దేశిస్తుంది, పార్టీలు సమాజాన్ని ఏ విధంగా అదుపులో పెడుతున్నాయి అనే విషయాలను పరిశీలిస్తుంది. కాని కేవలం సామాజిక ఆర్థిక అవసరాల ఫలితమే రాజకీయ పక్షాల అవతరణ అనే పాక్షిక భావనను అంగీకరించరు. సమాజంలోని వైరుధ్యాలను, చీలికలను వర్గ ప్రయోజనాలను నాయకుడు తన ఆశయ సాఫల్యానికి ఏ విదంగా ఉపయోగించుకొంటున్నాడు అనే విషయాన్ని విశదపరచగలదు.
సారాంశం
మ
పైన వివరించిన వివిధ అంశాలను దృష్టిలో పెట్టుకొని అంతర్ శాస్త్ర అధ్యయన ఫలితంగా సమాజ, రాజనీతిశాస్త్రం పరస్పర సంబంధముచే అవతరించి సామాజిక, రాజకీయ కారకాలకు తగిన ప్రాదాన్యతనిస్తే రాజనీతిశాస్త్రంలో అంతర్ భాగంగా కూడా కొనసాగుతున్న ఈ శాస్త్రాన్ని రాజకీయ సమాజశాస్త్రం అనే పేర్కొనటం సమంజసమైనదని పలువురు శాస్త్రజ్ఞులు అభిప్రాయపడుతున్నారు.
రాజకీయ వ్యవస్థ సమాజంలో ఒక భాగమనీ, దాన్ని అర్ధం చేసుకోవాలంటే సామాజిక వ్యవస్థను తెలుసుకోవలసిన ఆవశ్యకత ఉన్నదని వివరించి రాజకీయ సమాజ శాస్త్రజ్ఞులు రాజనీతి శాస్త్ర అభివృద్ధికి తోడ్పడ్డారు. అయితే ఈ అభివృద్ధి సరైన దృక్పధంలో కొనసాగలేదని చెప్పవచ్చు.
రాజకీయ సామాజిక వ్యవస్థల మధ్య సంబంధాలను రాజకీయ సమాజ శాస్త్రజ్ఞులు వివిధ దృక్కోణాల నుండి పరిశీలిస్తున్నారు. రెండు వ్యవస్థల మధ్య సంబంధాల సామాన్య మార్పిడి పద్ధతిని పరిశీలించటం: సమాజం రాజకీయాల మధ్య ఎడతెగని సాధారణ సంబంధాల క్రమాలను పరిశీలించటం ఒకదాని తరువాత మరొకటి బహిర్గతమగు బహుచలాంకాల సంబంధాలు సమాజంలో ఆవిర్భవించి, రాజకీయ ప్రక్రియలకు లోనై తదనుగుణంగా మార్పు చెంది తిరిగి సమాజంలో ప్రవేశించే ప్రక్రియలను పరిశీలించటం, వివిధ పరశీలనా దృక్పధాలలో మఖ్యమైనవిగా భావించవచ్చును.
- డా॥ యం.పాండు రంగారావు
నమూనా పరీక్షా ప్రశ్నలు
I. ఈ క్రింది ప్రశ్నలకు 40 పంక్తులలో సమాధానాలు రాయండి
1. రాజకీయ సమాజ శాస్త్రము అనగా ఏమిటి ? నిర్వచించండి.
2. రాజకీయ సమాజ శాస్త్ర వృద్ధి క్రమాన్ని వివరించండి.
3. రాజకీయ సమాజ శాస్త్ర స్వభావము మరియు పరిధిని పేర్కొనండి.