Type Here to Get Search Results !

"నేనే లడ్డూనయితే?" – శ్రీమతి రాణీ సంయుక్త వ్యాస్

0

 

పై మాట చెప్పి తనను చూపించుకుంటూ "నేనే లడ్డూనయితే? ఎల్లాగా?" అని అమ్మ ఒక సందర్భంలో అన్నది. ఈ మాటను విస్తరించి వ్యాఖ్యానించటం ఒక సాహసమే అవుతుంది. అయినా అమ్మ ఆశీస్సుల ధైర్యంతో రాస్తున్నాను.

తానే లడ్డూ అయితే దానిని అనుభవించి, రుచి చూసి ఆస్వాదించేది ఎలా? — అమ్మకు ఎదురైన సమస్య. మాధుర్యమే మధురిమను కోరితే ఎలా ఉంటుంది? అందుకే పరబ్రహ్మస్వరూపంలో ఉన్న తాను అమ్మగా అవతరించి అద్వైత స్థితి నుండి ద్వైతస్థితిలోకి వచ్చి ఈ మాయా సృష్టిని దైవత్వంలో జీవులను వేరేగా తన బిడ్డలుగా సృజించి, జీవాత్మ–పరమాత్మల మధుర ప్రేమసంబంధాన్ని అనుభవించే ఆనందంకోసమే ద్వైతస్థితిలోకి అవతారంగా వచ్చింది.

ఈ మధురానుబంధం భగవంతుడికీ జీవుడికీ ఎన్నియుగాలైనా కొనసాగే రసమయ ప్రేమైక్య సంబంధం.

మనమూ–అమ్మా విడిగా ఉనికి కలిగి ఉంటేనే కదా అమ్మను ఆరాధించినా, పూజించినా, ప్రేమించినా ఆమె అపార ప్రేమను పొంది ధన్యులమవుతాం! అమ్మను విడిచి వెళ్లేటప్పుడు వియోగంతో కార్చే కన్నీళ్లు, చాలా కాలం తర్వాత వచ్చి ఆమె ఒడిలో వాలి కార్చే కన్నీళ్లు, ఆమె బుగ్గలు నిమిరి ఓదార్చటం, గారాబం చేయటం, గోరుముద్దలు తినిపించటం—ఈ మధుర లీలలు మనమూ ఆమెయూ అనుభవించేవి.

అందుకే అమ్మ మనల్ని లడ్డూలుగా (బ్రహ్మైక్యం) మార్చకుండా బిడ్డలుగానే ఉంచుకుని తానే లడ్డూ అయి మనకు మాధుర్యాన్ని రుచి చూపించింది. తాను అమ్మగానే ద్వైతరూపంలో అవతరించింది.

ఈ బద్ధజీవులను తరింప చేయటానికి, ద్వైతంలోని సుఖదుఃఖ భూయిష్టమైన సంసారంలో అమ్మగా అనేక పాట్లు తన బిడ్డల కోసం అనుభవించింది. ఆమె కరుణకు ప్రేమకు కళ్లుచెమర్చని భక్తులు వున్నారా? ఆ కన్నీళ్లు చాలా విలువైనవి, పవిత్రమైనవి. పరమప్రేమతో కార్చే కన్నీళ్లు ఆత్మను పరిశుద్ధం చేస్తాయి.

అందుకే అమ్మ ప్రేమతో కన్నీళ్లు కార్చి మనందరి చేత కన్నీళ్లు పెట్టించింది. ఈ బద్ధజీవులను ఉద్ధరించి ప్రేమమాధుర్యాన్ని చూపి తరింప చేయాలనే సంకల్పమే ఆమె అవతరణకు గల కారణం.


ఒకసారి ఒకరు అమ్మను “సన్యాసం పుచ్చుకోవాలని ఉంది” అని అడిగారు. అమ్మ వెంటనే,
"సన్యాసం పుచ్చుకుంటే వస్తుందా నాన్నా!" అని ప్రశ్నించింది.

"సన్యాసం అనేది ఒక మానసిక స్థితి. అది కాషాయాలు ధరించటం వల్లో, దీక్ష తీసుకున్నందువల్లో వచ్చేది కాదు. మనిషి మానసిక పరిపక్వత కలిగి అర్హత కలిగినపుడు ఆ సన్యాసస్థితి వస్తుంది. అది పుచ్చుకుంటే వచ్చే విషయం కాదు."

ఇది ఎంతటి నగ్నసత్యం! ఇంత కఠినమైన సత్యాన్ని ఎంత మృదువుగా చెప్పింది!


“లడ్డూ స్థితి” జీవస్థితిలోనూ పొందవచ్చు. ఒక పరిస్థితిలో భక్తుడు శరణాగతి చేసి భగవంతుడే రక్షకుడని నమ్మి, కష్టాలు వచ్చినా చలించకుండా భక్తితో నిలబడటం—ఇది ఒక స్థాయి. కానీ దీనికన్నా ఉన్నతమైనది “లడ్డూ స్థితి”.


త్రేతాయుగంలో ఉదాహరణలు:
దశరథుడు రాముడు అడవులకు వెళ్లే వేళ—"నా సుకుమార బాలరాముడు ముళ్లబాటలో ఎన్ని కష్టాలు పడతాడో!" అని విలపిస్తూ ప్రాణాలు విడిచాడు. ఇది పరమప్రేమ. ఇక్కడ భక్తుడు భగవంతుడినే రక్షించుకోవాలనే తాపత్రయం ఉంటుంది.

భక్త శబరి పుచ్చులు లేకుండా చూసి పళ్ళను రామునికి తినిపించింది. రామ–సీతా వియోగానికి చలించి దుఃఖించింది. వేల సంవత్సరాలు రాముని ప్రేమకై ఎదురు చూసింది.

లక్ష్మణుడు 14 సంవత్సరాలు నిద్రలేకుండా అన్నీ త్యాగం చేస్తూ రాముడి రక్షణకై అహర్నిశలు గడిపాడు.


ద్వాపరయుగంలో ఉదాహరణలు:
యశోదమ్మ కృష్ణుడిని రాక్షసుల బారి నుంచి రక్షించాలనే తల్లితత్వంలో మునిగిపోయింది.

దేవకీదేవి పుత్రవియోగాన్ని ఎన్నేళ్ళు అనుభవించింది.

బృందావన గోపగోపికలు — ఇవే లడ్డూ స్థితికి శిఖరాలు. వారు కృష్ణుడిని రక్షించాల్సిన ప్రాణసమానుడు అని భావించి ప్రేమోన్మత్తులయ్యారు.

ఒకసారి కృష్ణుడికి శిరోవేదన వచ్చింది. భక్తుల పాదధూళి కావాలని అన్నాడు. అన్ని రాణులు నిరాకరించగా, గోపికలు మాత్రం పాపం–పుణ్యం భయపడకుండా ప్రేమతో పాదధూళిని ఇచ్చారు. వారికి కృష్ణుని తలనొప్పి తగ్గడమే ముఖ్యం.


ఈ గోపికల ప్రేమను ఎవరూ అర్థం చేసుకోలేకపోయినా, "Heart of a Gopi" పుస్తకంలో (రెహన తాబీ) నీలాదేవి తన భర్త సందేహాలను తీర్చిన సంభాషణ ఎంతో అర్థవంతంగా ఉంటుంది.

ఆమె భర్తను ఉద్దేశించి —
"మిమ్మల్ని గాఢంగా ప్రేమించి ఆరాధించటం వల్లనే నాకు బహుమతిగా కృష్ణప్రేమ లభించింది. కృష్ణప్రేమను పొందాక నేను మిమ్మల్ని మరింత గాఢంగా ప్రేమిస్తున్నాను. మీలో కృష్ణుణ్ణి చూశాను."

అని చెప్పగా, ఆమె భర్త కూడా కృష్ణభక్తుడయ్యాడు.

ఇదే అమ్మ చెప్పిన “లడ్డూ స్థితి”. దీన్ని పొందటానికి లింగభేదం లేదు. అన్ని జీవులకు ఈ స్థితి సాధ్యం.


గజేంద్రునిలాగా అమ్మ మనందరినీ లడ్డూలుగా మార్చాలని ప్రార్థిస్తూ, అమ్మకు ఇష్టమైన హారతితో ఈ వ్యాసం ముగుస్తుంది—

"కళ్యాణహారతిని కళవూ నీవే దేవి,
ఇలవేల్పు వుంటివే ఇల్లెల్ల,
శుభకళలదీవింపవే ఓ తల్లి!"

Tags

Post a Comment

0 Comments